COVID19: కరోనా పరిస్థితులపై ఫేక్​ న్యూస్​.. ట్విట్టర్​ కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు!

Govt asks Twitter to block some tweets critical of its Covid handling

  • పలు ట్వీట్లను బ్లాక్ చేసిన ట్విట్టర్
  • కాంగ్రెస్ ఎంపీ రేవంత్ ట్వీట్ కూడా బ్లాక్
  • పలువురు ప్రముఖుల ట్వీట్లపై చర్యలు
  • భారత ఐటీ చట్టాలకు వ్యతిరేకమంటూ ట్విట్టర్ కామెంట్

దేశంలో కరోనా పరిస్థితులకు సంబంధించి తప్పుడు సమాచారం (ఫేక్ న్యూస్), పుకార్లు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. చాలా మంది ప్రముఖులూ పాత ఫొటోలను షేర్ చేస్తుండడంతో సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు ఇచ్చింది. ఇలాంటి ఫేక్ న్యూస్ లను బ్లాక్ చేయాల్సిందిగా ట్విట్టర్ కు ఇప్పటికే నోటీసులు వెళ్లాయి. దీంతో కరోనాకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్లను ట్విట్టర్ బ్లాక్ చేసింది.

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదంటూ వారు పలు ఫొటోలతో ట్వీట్లు చేశారు. అయితే, ప్రభుత్వాన్ని ఎండగట్టినందుకే ట్విట్టర్ కు నోటీసులిచ్చారన్న విమర్శలు రావడంతో... కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టతనిచ్చాయి. ప్రభుత్వాన్ని విమర్శించినందుకు కాదని, పాత ఫొటోలు, తప్పుడు సమాచారానికి సంబంధించిన పోస్టులనే బ్లాక్ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చామని స్పష్టం చేశాయి.

ప్రముఖుల ట్వీట్లను బ్లాక్ చేయడంపై ట్విట్టర్ కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. అయితే, ఫేక్ న్యూస్ ను పోస్ట్ చేసిన వారికి మాత్రం.. భారత ఐటీ చట్టానికి వ్యతిరేకంగా ఆ ట్వీట్లున్నాయంటూ నోటీసులు పంపింది. ఇప్పటిదాకా ఎవరెవరి ట్వీట్లను బ్లాక్ చేసిందో ల్యూమెన్ వెబ్ సైట్ లో ట్విట్టర్ వెల్లడించింది. ఏప్రిల్ 22, 23వ తేదీల్లో వందల సంఖ్యలో ట్వీట్లను బ్లాక్ చేసినట్టు తెలిపింది.

అయితే, కేవలం భారత్ లో మాత్రమే ఆ ట్వీట్లు అందుబాటులో ఉండవు. విదేశాల్లో మాత్రం అందుబాటులో ఉంటాయి. తమకు న్యాయబద్ధమైన విజ్ఞప్తులు వస్తే ఒక దేశ ఐటీ చట్టపు నిబంధనలు, ట్విట్టర్ నిబంధనలకు అనుగుణంగా చర్యలకు ఉపక్రమిస్తామని ట్విట్టర్ స్పష్టం చేసింది. ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘిస్తోందని తేలితే ఆ ట్వీట్లు ఎక్కడా అందుబాటులో లేకుండా చేస్తామని చెప్పింది. అయితే, ఓ దేశ చట్టాలను ఉల్లంఘించి, ట్విట్టర్ నిబంధనలకు లోబడే ఉంటే మాత్రం.. ఆ దేశంలోనే ట్వీట్ ను బ్లాక్ చేస్తామని, వేరే దేశాల్లో అది అందుబాటులోనే ఉంటుందని తెలిపింది.

  • Loading...

More Telugu News