Nara Lokesh: తన పేరుతో ఫేక్ ట్వీట్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన నారా లోకేశ్
- ఏపీ ప్రజలకు ఉచితంగా టీకా అంటూ సీఎం జగన్ ప్రకటన
- లోకేశ్ ఆ ప్రకటనను తప్పుబట్టినట్టు వ్యతిరేక ప్రచారం
- ఫేక్ బతుకులు అంటూ ఆగ్రహం
- ఎంతకైనా దిగజారతారని మండిపాటు
ఏపీలో మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించాలని సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం జగన్ నిర్ణయాన్ని లోకేశ్ వ్యతిరేకిస్తున్నట్టు ఓ ట్వీట్ సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఆ ట్వీట్ లో.... ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయం మూర్ఖత్వానికి పరకాష్ట అని, రూ.400 ఖర్చు చేసి ప్రజలను వ్యాక్సిన్ కొనుగోలు చేయనివ్వకుండా వారిని సోమరిపోతులను చేస్తున్నాడని లోకేశ్ వ్యాఖ్యానించినట్టు పేర్కొన్నారు. దీనిపై లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు.
జగన్ వేసే 5 రూపాయల ముష్టి కోసం పేటీఎం కుక్కలు ఎంతకైనా దిగజారతాయని మండిపడ్డారు. మీ నాయకుడి వద్ద సరుకు లేదు... ఇక మీ బతుకులు ఫేక్ ట్వీట్లు వేసుకుని సంబరపడడమే అని ఎద్దేవా చేశారు. ప్రజలకు మాస్కు కూడా ఇవ్వలేని అసమర్థుడు అంటూ విమర్శించారు. పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్ తో కరోనా చచ్చిపోతుందన్న మీ జగరోనా మాటలు విని ప్రపంచమంతా నవ్వుకుందని వ్యంగ్యం ప్రదర్శించారు. ఇప్పటికైనా ఫేక్ ట్వీట్లు మానుకుని ప్రజల ప్రాణాలు కాపాడమని మీ జగరోనాకు గడ్డిపెట్టండి అని లోకేశ్ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు.