taapsee pannu: ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేసే బదులు కారు ఇవ్వాలన్న నెటిజన్.. తాప్సీ సమాధానం ఇది!
- కరోనా రోగులకు అవసరమైన సమాచారాన్ని పోస్టు చేస్తున్న తాప్సీ
- తనను ప్రశ్నించిన నెటిజన్‌కు సుతిమెత్తని హెచ్చరిక
- పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక సలహా ఇమ్మని సూచన
ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేసే బదులు ఖరీదైన నీ కారు ఇస్తే బాధితులకు ఏదో ఒకరకంగా ఉపయోగపడుతుంది కదా.. అన్న నెటిజన్ ప్రశ్నకు బాలీవుడ్ నటి తాప్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రిప్లై ఇచ్చింది. దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఆక్సిజన్, బెడ్లు దొరక్క కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో నటి తాప్సీ అవసరమైన వారికి తగిన సమాచారాన్ని ట్విట్టర్ వేదికగా పోస్టు చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లతోపాటు అవసరమైన మందులు ఎవరి వద్ద లభ్యమవుతాయన్న వివరాలను పోస్టు చేస్తున్నారు.
ఇది చూసిన ఓ నెటిజన్.. ‘‘ఇలా ఇంట్లో కూర్చుని ట్వీట్లు చేయకపోతే ఖరీదైన నీ కారును వాళ్లకు అందిస్తే ఏదో రకంగా ఉపయోగించుకుంటారు కదా‘‘ అని ట్వీట్ చేశాడు. స్పందించిన తాప్సీ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చెత్త మెసేజ్‌లతో తన సమయాన్ని వృథా చేయవద్దని కోరింది. ఒకవేళ మీలాంటి వాళ్లు ఇదే చెప్పాలనుకుంటే దేశం మళ్లీ సాధారణంగా ఊపిరి పీల్చుకునే వరకు నోరు విప్పొద్దని సూచించింది. తాను ఏం చేయాలనుకున్నానో అది చేయనివ్వాలంటూ ఆ నెటిజన్‌పై మండిపడింది.