COVID19: కరోనా కోరల నుంచి బయటపడుతున్న 99 శాతం మంది: కేంద్ర గణాంకాలు
- మొత్తం మరణాల రేటు 1.12 శాతం మాత్రమే
- మొత్తం 1.73 కోట్ల మంది బాధితుల్లో చనిపోయిన వారు 1.95 లక్షల మంది
- వెంటిలేషన్ అవసరమవుతున్నది 28 శాతం మందికే
కరోనా కోరల్లో చిక్కి దేశం అల్లాడిపోతున్న వేళ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ప్రజలకు ఇది శుభవార్తే. కొవిడ్ బారిన పడిన వారిలో దాదాపు 99 శాతం మంది బయటపడుతున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.మొత్తం కేసుల్లో మరణాల రేటు1.12 శాతం మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అంటే దాదాపు 99 శాతం మంది మహమ్మారి బారి నుంచి బయటపడుతున్నవారే.
ఇప్పటి వరకు 1.73 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా 1.95 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మిగతా వారంతా కరోనా నుంచి బయటపడ్డారు. కేంద్రం తాజా లెక్కల ప్రకారం.. 1.12 శాతం మంది మరణించగా, 98.8 శాతం మంది కోలుకుంటున్నారు. వీరిలో చాలామంది ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుని ఆరోగ్యవంతులుగా మారుతున్నారు. ఇక ఆసుపత్రుల్లో చేరిన వారిలో 28 శాతం మందికి మాత్రమే వెంటిలేషన్ అవసరమవుతోంది. అయితే, తొలుత ఇది 37 శాతంగా ఉండగా, ప్రస్తుతం అది తగ్గింది.
నిన్న 3.52 లక్షల మంది కరోనా కోరల్లో చిక్కుకోగా, 2,812 మంది మరణించారు. నిన్న కొత్తగా 2.20 లక్షల మంది కరోనా నుంచి బయటపడ్డారు. ఈ స్థాయిలో రికవరీలు నమోదైంది ఒక్క భారత్లోనే.