Chris Lynn: భారత్ నుంచి మమ్మల్ని తీసుకెళ్లేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయండి: ఆసీస్ ఆటగాడు క్రిస్ లిన్
- భారత్ లో కరోనా విశ్వరూపం
- హడలిపోతున్న ఐపీఎల్ విదేశీ ఆటగాళ్లు
- ఇప్పటికే స్వదేశానికి పయనమైన ముగ్గురు ఆస్ట్రేలియన్లు
- భారత్ నుంచి వచ్చే విమానాలపై ఆస్ట్రేలియా నిషేధం
- క్రికెటర్లు సొంతంగా ఏర్పాట్లు చేసుకుని రావాలన్న ఆస్ట్రేలియా ప్రధాని
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ బీభత్సం ఐపీఎల్ లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్ల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి తప్పుకుని స్వదేశం పయనమయ్యారు. వారు పయనమైన కొన్ని గంటల్లోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. అత్యంత అవసరమైతే తాము ప్రత్యేక విమానాల్లో ఆస్ట్రేలియన్లను భారత్ నుంచి తరలిస్తామని ప్రధాని స్కాట్ మోరిసన్ వెల్లడించారు. క్రికెటర్ల గురించి మాట్లాడుతూ, వారంతా సొంత పనులపైనే వెళ్లారని, ఆస్ట్రేలియా తరఫున అధికారికంగా ఏమీ వెళ్లలేదని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో, ముంబయి ఇండియన్స్ ఆటగాడు క్రిస్ లిన్ తమ భవితవ్యంపై ఆందోళన వ్యక్తం చేశాడు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ముగియనుందని, ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి తమను భారత్ నుంచి తీసుకెళ్లాలని క్రికెట్ ఆస్ట్రేలియా (ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు)ను కోరాడు. ప్రస్తుతం తాము కఠిన నిబంధనలతో కూడిన బబుల్ లో ఉన్నామని, వచ్చే వారం కరోనా టీకా తీసుకుమంటామని లిన్ చెప్పాడు. అయితే, తమను ప్రత్యేక విమానంలో తీసుకెళ్లే అంశాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా పరిశీలించాలని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుత పరిస్థితి ఘోరంగా ఉందని అభిప్రాయపడ్డాడు.