Corona Virus: కరోనా లక్షణాలతో భారీగా పరీక్షా కేంద్రాలకు ప్రజలు.. ఉదయం నుంచే క్యూ కడుతోన్న వైనం
- ఊహించని రీతిలో పెరిగిపోతోన్న కరోనా కేసులు
- గుంపులు గుంపులుగా జనం
- పరీక్షా కేంద్రాల వద్ద సిబ్బందితో ప్రజల గొడవ
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఊహించని రీతిలో పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. దేశంలో కరోనా లక్షణాలతో పరీక్షా కేంద్రాలకు వస్తోన్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగిపోతోంది. కరోనా టెస్టుల కోసం పరీక్షా కేంద్రాల వద్ద ప్రజలు వందల సంఖ్యలో బారులు తీరి కనపడుతున్నారు. క్యూలో నిలబడడానికి ఉదయం నుంచే వచ్చి పోటీ పడుతున్నారు.
చాలా ప్రాంతాల్లో కరోనా కేంద్రాల వద్ద గుంపులు గుంపులుగా జనం కనపడుతున్నారు. దీంతో కరోనా లేని వారికి ఈ కేంద్రాల వద్ద కరోనా సోకే ప్రమాదం పొంచి ఉంది. భౌతిక దూరం అనేదే మర్చిపోతున్నారు. పలు టెస్టింగ్ కేంద్రాల్లో 50 మందికి మాత్రమే పరీక్షలు చేస్తుండడంతో సిబ్బంది ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ గొడవపెట్టుకుంటున్నారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లోనూ ఈ తీరు కనపడుతోంది. కూకట్పల్లిలోని ఎల్లమ్మ బండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఒకే చోట కరోనా పరీక్షలతో పాటు, వాక్సిన్ కూడా వేస్తుండడంతో ఆ లైను ఏదో తేల్చుకోలేక ప్రజలు తికమకపడుతున్నారు.