Delhi: ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేసిన ఢిల్లీ
- 44 డిగ్రీలు దాటిన ఢిల్లీ ఉష్ణోగ్రతలు
- రేపు స్వల్ప వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ
- ఆదివారం 38 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వెల్లడి
దేశ రాజధాని ఢిల్లీని మండుటెండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ వేసవి సీజన్ లోనే అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నిన్న నమోదయ్యాయి. ఏకంగా 44 డిగ్రీల సెంటిగ్రేడ్ కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భారత వాతారణశాఖ డేటా ప్రకారం ఈ సీజన్ లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. నజఫర్ ఘర్, నరేలాలో 44.4 డిగ్రీలు, మంగేశ్ పూర్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అయితే ఢిల్లీవాసులకు వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు అందించింది. శనివారంనాడు ఆకాశం కొంతమేర మేఘావృతం అయ్యుంటుందని, స్వల్ప వర్షం కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదివారంనాటికి ఉష్ణోగ్రతలు తగ్గి ... 38 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.