Devineni Uma: నన్ను అరెస్టు చేసే అవకాశం ఉంది: దేవినేని ఉమ
- మంగళగిరి సీఐడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం వెళ్లిన దేవినేని
- జగన్ను సంతోష పెట్టడమే అధికారుల లక్ష్యమని వ్యాఖ్య
- ఈ రోజు రాత్రి 10 గంటల వరకు విచారణ జరుపుతారని ఆరోపణ
- రైతుల తరఫున రాజమహేంద్రవరం జైలులో ఉండేందుకు సిద్ధమన్న నేత
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మరోసారి మంగళగిరి సీఐడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం వచ్చారు. మీడియా సమావేశంలో సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తూ వీడియో మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై దేవినేని ఉమకు సీఐడీ అధికారులు నిన్న నోటీసులు పంపడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్ను సంతోష పెట్టడం కోసం అధికారులు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పారు.
కోర్టు ఆదేశాల మేరకు తాను రెండోసారి సీఐడీ అధికారుల ముందుకు విచారణకు వెళ్తున్నట్లు తెలిపారు. తనను ఈ రోజు రాత్రి 10 గంటల వరకు లోపలే కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. తనను, తమ పార్టీ నేత ధూళిపాళ్లను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ లో జే ట్యాక్స్ పేరుతో ధాన్యం దోపిడీ జరుగుతోందని ఆయన ఈ సందర్భంగా ఆరోపణలు గుప్పించారు. దాన్ని తాను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో తనను అరెస్టు చేస్తే రైతుల తరఫున రాజమహేంద్రవరం జైలులో ఉండేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు.
మరోవైపు, అంతకు ముందు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఏపీలో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులపై విమర్శలు గుప్పించారు. 'ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్న కరోనాబాధితులు. టెస్ట్ లకు అధిక ధరలు. ఇంజక్షన్లు, మందులు బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు. సరిపడాలేని కరోనా పరీక్ష, వ్యాక్సినేషన్ సెంటర్లతో వైరస్ విజృంభించే ప్రమాదం. కొవిడ్ పై సమీక్ష నిర్వహించి ఆక్సిజన్, బెడ్లు, వ్యాక్సినేషన్ పై వాస్తవాలు ప్రజలకు చెప్పండి వైఎస్ జగన్' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.