Sputnik V: హైదరాబాద్ చేరుకున్న స్పుత్నిక్ - వీ వ్యాక్సిన్ డోసులు
- తొలి విడతలో రష్యా నుంచి 1.5 లక్షల డోసులు
- ఈ నెలాఖరు నాటికి మరో 30 లక్షల డోసులు
- డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ తో ఒప్పందం
- ఇకపై దేశంలో స్పుత్నిక్ - వీ వ్యాక్సిన్ పంపిణీ!
కరోనా నివారణకు రష్యా తయారు చేసిన స్పుత్నిక్ - వీ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ కూడా ఒకటి. తాజాగా, స్పుత్నిక్ - వీ వ్యాక్సిన్ డోసులు హైదరాబాదు చేరుకున్నాయి. భారత్ తో ఒప్పందంలో భాగంగా, తొలి విడతలో రష్యా రాజధాని మాస్కో నుంచి 1.5 లక్షల వ్యాక్సిన్ డోసులతో బయల్దేరిన విమానం కొద్దిసేపటి కిందట హైదరాబాదు చేరుకుంది. వీటిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ కు అప్పగించనున్నారు.
మరో 30 లక్షల డోసులు ఈ నెలాఖరు నాటికి భారత్ కు పంపించేందుకు రష్యా అంగీకరించింది. అనంతరం, జూన్ లో 50 లక్షల డోసులు, జూలైలో కోటికి పైగా డోసులు భారత్ రానున్నాయి. భారత్ లో స్పుత్నిక్ - వీ క్లినికల్ ట్రయల్స్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ చేపడుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు పంపిణీ చేస్తున్నారు. వీటితోపాటు ఇకపై స్పుత్నిక్ - వీ వ్యాక్సిన్ ను కూడా అందించనున్నట్టు తెలుస్తోంది.