Bandi Sanjay: ఏ శాఖలో ఎక్కువ నిధులు ఉంటే.. ఆ శాఖను కేసీఆర్ తీసుకుంటారు: బండి సంజయ్
- కరోనా కట్టడిలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది
- ప్రజలకు కేసీఆర్ కనీసం భరోసా కూడా ఇవ్వలేకపోతున్నారు
- ప్రజల దృష్టిని మరల్చడానికే ఈటల పేరుతో డ్రామాలు
కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. కరోనాకు కేంద్ర పభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని చెప్పారు. ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. మహమ్మారికి సంబంధించిన వాస్తవాలను కూడా వెల్లడించడం లేదని విమర్శించారు.
ప్రజలంతా వ్యాక్సిన్ వేయించుకోవాలని కూడా కేసీఆర్ చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయుష్మాన్ భవను అమలు చేయమంటే... ఆరోగ్యశ్రీ ఉందని చెప్పారని.. ఇప్పుడు కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేక పేదలు ప్రాణాలు విడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈటల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఏ శాఖలో ఎక్కువ నిధులు ఉంటే ఆ శాఖను కేసీఆర్ తీసుకుంటారని ఎద్దేవా చేశారు.