Kerala: కేరళలో 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందజేయడంలో జాప్యం జరగొచ్చు: విజయన్
- టీకాల కొరతే కారణం
- 45 ఏళ్ల పైబడిన వారికీ మే 30లోపు అందరికీ టీకాలు అందించలేం
- కేంద్రం వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- రెండో డోసు తీసుకోవాల్సిన వారికే తొలి ప్రాధాన్యం
- రూ.500కే ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరపాలి
మూడో విడతలో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా ఇవ్వాల్సిన కార్యక్రమం కేరళలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. తయారీ సంస్థల నుంచి ఇంకా వ్యాక్సిన్లు అందకపోవడమే అందుకు కారణమన్నారు. వారి నుంచి టీకాలు సేకరించే ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు.
మే 30 నాటికి 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని విజయన్ తెలిపారు. కానీ, ఇంకా వ్యాక్సిన్లు అందని నేపథ్యంలో ఇందులో కూడా జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం వెంటనే స్పందించి సరిపడా టీకాలు అందేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తొలి డోసు కోసం రిజిస్టర్ చేసుకున్న వారి కంటే రెండో డోసు తీసుకోవాల్సిన వారికే ప్రాధాన్యం ఇస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయించినట్లుగా రూ.500కే ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని ప్రైవేట్ ఆసుపత్రులకు స్పష్టం చేశారు.