Elections: మినీ సార్వత్రికం తొలి ట్రెండ్స్... పశ్చిమ బెంగాల్, కేరళ హోరాహోరీ... తమిళనాడు డీఎంకే వైపు!
- ఈ ఉదయం మొదలైన కౌంటింగ్
- అసోంలో భారీ ఆధిక్యంలో బీజేపీ
- పుదుచ్చేరిలో ఆధిక్యంలో ఎన్ఆర్సీ
గడచిన నెలన్నర రోజులుగా ఉత్కంఠను రేపిన మినీ సార్వత్రిక ఎన్నికల ఫలితాల తొలి ట్రెండ్స్ వచ్చేశాయి. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ లు నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుండగా, తమిళనాడులో డీఎంకే స్పష్టమైన మెజారిటీ దిశగా సాగుతోంది.కేరళ ఎల్డీఎఫ్ ముందుండగా, కాాంగ్రెస్ వెనకాలే వస్తోంది. అసోంలో మాత్రం బీజేపీ మెజారిటీ దిశగా పరుగులు పెడుతోంది. ఇక పుదుచ్చేరి విషయానికి వస్తే, ఎన్ఆర్సీ ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉంది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రెండ్స్ ను పరిశీలిస్తే, 294 అసెంబ్లీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లో 164 స్థానాల ట్రెండ్స్ వచ్చాయి. టీఎంసీ 83 స్థానాల్లో, బీజేపీ 79 స్థానాల్లో, లెఫ్ట్ పార్టీలు 2 స్థానాల్లో ముందున్నాయి. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా, 94 స్థానాల్లో ట్రెండ్స్ వెలువడ్డాయి. విపక్ష డీఎంకే 54 చోట్ల, అన్నాడీఎంకే కూటమి 40 చోట్ల ముందంజలో ఉన్నాయి.
కేరళ విషయానికి వస్తే, 140 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగగా, ప్రస్తుతం 121 చోట్ల ట్రెండ్స్ వచ్చాయి. ఎల్డీఎఫ్ 65 చోట్ల, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 48 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. అసోంలో 126 స్థానాలుండగా, 55 నియోజకవర్గాల ఓటింగ్ సరళి బయటకు వచ్చింది. బీజేపీ 32 చోట్ల, కాంగ్రెస్ 19 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. పుదుచ్చేరిలో 30 స్థానాలుండగా, ప్రస్తుతానికి ఎన్ఆర్సీ 5, కాంగ్రెస్ కూటమి 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.