Devineni Uma: శ్మశాన వాటికలో మృతదేహాలను క్యూ లో ఉంచాల్సిన పరిస్థితి: దేవినేని ఉమ
- ఏపీలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేదు
- అందుకే ఇటువంటి పరిణామాలు
- ఏపీలో రోగులకు అందిస్తోన్న సౌకర్యాలపై జగన్ వివరాలు చెప్పాలి
- పరీక్షలు నిర్వహిస్తుండడంతో
- విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ఈ రోజు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో కరోనా విజృంభణ విపరీతంగా పెరిగిపోతోందని, దాని కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేకపోవడం వల్లే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.
ఏపీలో రోగులకు అందిస్తోన్న సౌకర్యాలపై ముఖ్యమంత్రి జగన్ మీడియా ముందుకు వచ్చి పూర్తి వివరాలు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో శ్మశాన వాటికల్లో మృతదేహాలను క్యూలో ఉంచాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పారు. సామాన్య ప్రజలు కరోనాతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జర్నలిస్టులు కూడా మృతి చెందుతున్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు వ్యాక్సిన్ వేయడానికి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపారు. కరోనా సమయంలో పరీక్షలు నిర్వహిస్తుండడంతో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారని, దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు.