EC: విజయోత్సవాలు జరుపుకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయండి: సీఎస్ లకు ఈసీ ఆదేశం
- దేశంలో ఎన్నికల కౌంటింగ్ షురూ
- ఫలితాలపై పలు చోట్ల స్పష్టత
- సంబరాలకు తెరదీసిన పార్టీలు
- ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ
ఎన్నికల ట్రెండ్స్ పై క్రమేపీ స్పష్టత వస్తుండడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో పార్టీలు సంబరాలకు తెరదీశాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలు, బహిరంగ వేడుకలు జరపవద్దని తాము నిషేధాజ్ఞలు విధించినప్పటికీ కొన్నిచోట్ల అతిక్రమిస్తుండడం పట్ల ఈసీ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
ఈ నేపథ్యంలో, ఎవరైనా విజయోత్సవ ర్యాలీలు చేపడితే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, ఆ ప్రాంత ఎస్ఐని సస్పెండ్ చేయాలని అన్ని రాష్ట్రాల సీఎస్ లకు ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాగా, తమిళనాట డీఎంకే విజయంపై దాదాపు స్పష్టత వచ్చిన నేపథ్యంలో అక్కడే ఎక్కువగా విజయోత్సవాలు జరుగుతున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది.