Sunsrisers: రాజస్థాన్ రాయల్స్ తో పోరులో వార్నర్ లేకుండానే బరిలో దిగిన సన్ రైజర్స్
- ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్
- వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తప్పించిన యాజమాన్యం
- తుది జట్టులోనూ లభించని స్థానం
ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాల నేపథ్యంలో సన్ రైజర్స్ కు కేన్ విలియమ్సన్ రూపంలో కొత్త కెప్టెన్ వచ్చాడు. డేవిడ్ వార్నర్ ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ నిన్న సన్ రైజర్స్ యాజమాన్యం ప్రకటన చేయడం తెలిసిందే. అయితే, వార్నర్ ను ఆటగాడి జట్టులో కొనసాగిస్తారని అందరూ భావించారు. కానీ, వార్నర్ కు ఆటగాడిగా కూడా తుదిజట్టులో స్థానం దక్కలేదు.
కెప్టెన్సీ వైఫల్యం వార్నర్ ఆటతీరుపైనా ప్రభావం చూపింది. ఈ ఐపీఎల్ సీజన్ లో వార్నర్ పెద్దగా రాణించిందేమీలేదు. దాంతో అతడ్ని పక్కనబెట్టాలని సన్ రైజర్స్ మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో నేటి మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో మహ్మద్ నబీ, భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్ జట్టులోకి వచ్చారు. వార్నర్ తో పాటు, సుచిత్, సిద్ధార్థ్ కౌల్ లను తప్పించారు.
ఇక, రాజస్థాన్ రాయల్స్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఉనద్కట్ కు విశ్రాంతి కల్పించి కార్తీక్ త్యాగికి చోటు కల్పించారు. శివమ్ దూబే స్థానంలో కొత్త కుర్రాడు అనుజ్ రావత్ ను తీసుకున్నారు. ఈ మ్యాచ్ కు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిలుస్తోంది.