Mayank Agarwal: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై వీరవిహారం చేసిన మయాంక్ అగర్వాల్
- 58 బంతుల్లో 99 పరుగులు చేసిన మయాంక్
- కేఎల్ రాహుల్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టిన మయాంక్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 రన్స్ చేసిన పంజాబ్
- ఢిల్లీ బౌలర్ రబాడాకు 3 వికెట్లు
రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అనారోగ్యంతో తప్పుకోవడంతో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన మయాంక్ అగర్వాల్ విధ్వంసక ఇన్నింగ్స్ తో అలరించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో మయాంక్ చిచ్చరపిడుగులా చెలరేగి ఆడాడు. మొత్తం 58 బంతులు ఎదుర్కొన్న మయాంక్ 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. మయాంక్ ఇన్నింగ్స్ సాయంతో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు నమోదు చేసింది. డేవిడ్ మలాన్ 26 పరుగులు సాధించాడు.
ఢిల్లీ బౌలర్లలో కగిసో రబాడా 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ (13)కు రబాడా వేసిన ఓ బంతి హైలైట్ గా నిలిచింది. ఫుల్ టాస్ గా వచ్చిన ఆ బంతి, ఒక్కసారిగా గాల్లోనే స్వింగ్ అవడంతో గేల్ లైన్ మిస్సయ్యాడు. దాంతో ఆ బంతి గేల్ వికెట్లను గిరాటేసింది.