Etela Rajender: అరెస్టులకు, కేసులకు భయపడను.. నా ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారు: ఈటల రాజేందర్
- కలెక్టర్ నివేదిక మాకు అందలేదు
- మా వివరణ కూడా అధికారులు అడగలేదు
- వ్యక్తులు, పార్టీలు ఉంటాయి పోతాయి కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతం
- ప్రభుత్వం నుంచి నేను ఐదు పైసల సాయం తీసుకోలేదు
- ఐదు కుంటల భూమిని కూడా పొందలేదు
తెలంగాణ నేత ఈటల రాజేందర్‌ను మంత్రి వర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆయన భూములు కాజేశారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ కూడా కొనసాగుతుంది. దీనిపై ఈ రోజు ఈటల మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను అరెస్టులకు, కేసులకు భయపడే వ్యక్తిని కాదని, తన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులను పెట్టారని చెప్పారు. ఎంత పెద్ద కేసులయినా పెట్టుకోండని, తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని చెప్పారు
భూములను కాజేశానంటూ వస్తోన్న ఆరోపణలపై విచారణ జరిపిన కలెక్టర్ నివేదిక తమకు అందలేదని తెలిపారు. తమ వివరణ కూడా అధికారులు అడగలేదని అన్నారు. వ్యక్తులు, పార్టీలు ఉంటాయి పోతాయి కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతమని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రభుత్వం నుంచి తాను ఐదు పైసల సాయం కూడా తీసుకోలేదని, అలాగే ఐదు కుంటల భూమిని కూడా పొందలేదని చెప్పారు. అసైన్డ్ భూముల్లో పలు కంపెనీలు రోడ్లే వేయలేదా? అని ప్రశ్నించారు. తాను 66 ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు అధికారులు నివేదిక ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థతో విచారణ జరిపించాలని చెప్పారు. అంతేగానీ, ప్రభుత్వం ఏది చెబితే అది చేసే అధికారులతో విచారణ జరిపించకూడదని డిమాండ్ చేశారు.
19 ఏళ్లపాటు సీఎం కేసీఆర్‌తో కలిసి పని చేశారని, ఫ్లోర్ లీడర్‌గా కూడా తనకు అవకాశం వచ్చిందని చెప్పారు. తనకు మంత్రిగా కూడా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని చెప్పారు. తాను పార్టీకి, ప్రభుత్వానికి, కేసీఆర్‌కు మచ్చతెచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదన్నారు.
తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తనకు అసెంబ్లీలో పోరాడే అవకాశం కల్పించారని ఆయన చెప్పారు. అప్పట్లో కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా అధర్మం వైపు వెళ్లలేదని చెప్పారు. ఆయన తెలంగాణ ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారని, డబ్బులను నమ్ముకోలేదని చెప్పుకొచ్చారు. అటువంటి కేసీఆర్ ఇప్పుడు తనలాంటి సాధారణ వ్యక్తిపై తన శక్తినంతా ఉపయోగిస్తున్నారని చెప్పారు.
తనపై అన్ని శాఖలను ఉపయోగిస్తున్నారని, అలాగే, నర్సాపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని పిలిపించుకొని మాట్లాడారని తెలిపారు. చర్చల తర్వాత అసత్య ప్రచారానికి పాల్పడడం కేసీఆర్ హోదాకు తగదని ఈటల విమర్శలు గుప్పించారు. తాము అప్పట్లో కేసీఆర్‌తో అడుగు వేశాక పూర్తిగా ప్రజల్లో ఉన్నామని అన్నారు.
అసైన్డ్ భూములు కొనుగోలు చేసి ఉంటే శిక్షకు అర్హుడినని ఈటల చెప్పారు. తనకు సంబంధం లేని భూమలను చూపించి అవి తమవని చెబుతున్నారని తెలిపారు. అధికారులు ప్రభుత్వం చెప్పింది చేయవచ్చని, భూములు కొలుస్తామని ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదని ఆయన చెప్పారు. తాము లేకుండా వందల మంది పోలీసులను పెట్టి సర్వే కూడా చేయించడం సరైందా? అని ప్రశ్నించారు.
భూ కబ్జా ఆరోపణలపై కొందరితో తనకు వ్యతిరేకంగా మాట్లాడించారని, ఓ సర్పంచ్ ముందుగా ఒకలా మాట్లాడి, ఆ తర్వాత మరోలా మాట మార్చారని చెప్పారు. దేవరయాంజిల్ భూముల విషయంలో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోవాలని అప్పట్లో వైఎస్‌ఆర్‌కు కూడా సవాలు విసిరానని చెప్పారు.
తన కోసం దేవరయాంజిల్ ప్రజలను ఇబ్బంది పెట్టకూడదని చెప్పారు. అవి దేవాదాయ భూములు అని నిరూపించే పత్రాలు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్ ఇచ్చిన నివేదిక పచ్చి అబద్ధమని చెప్పారు. తన మొత్తం ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్ కార్యాచరణపై..
తాను పదవుల కోసం పాకులాడబోనని ఈటల రాజేందర్ చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి ఆ పదవికి రాజీనామా చేయాలని ఆ పార్టీ అడగవచ్చని తెలిపారు. తన భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తాను కొత్త పార్టీ పెడతానని, పార్టీ మారతానని ఎన్నడూ చెప్పలేదని అన్నారు.