Nara Lokesh: అలా చేస్తే ఏపీలోని ఆసుపత్రుల్లో ఇంతమంది ఊపిరి ఆగిపోయేది కాదు: లోకేశ్
- ప్రభుత్వం ఆధిపత్య రాజకీయాలపై చూపించే శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపాలి
- ప్రతిపక్షనేతల్ని కక్షగట్టి అరెస్ట్ చేయించేందుకు యంత్రాంగాన్ని వాడుతున్నారు
- ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వారిని వాడితే బాగుంటుంది
- దొంగ ఓట్లు వేయించుకోవడంపై పెట్టిన శ్రద్ధ ఆక్సిజన్ అందించడంపై పెట్టాలి
కరోనా వేళ వైసీపీ ప్రభుత్వం తమ శ్రద్ధను రాజకీయాలపై కాకుండా ప్రజల ఆరోగ్యంపై చూపితే బాగుంటుందంటూ టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'ప్రభుత్వం ఆధిపత్య రాజకీయాలపై చూపించే శ్రద్ధ, ప్రజలకు ఆక్సిజన్ అందించడంపై చూపెడితే హిందూపురం ఆసుపత్రిలో 8 మంది చనిపోయేవారు కాదు. ప్రతిపక్షనేతల్ని కక్షగట్టి అరెస్ట్ చేయించేందుకు వాడుతున్న యంత్రాంగాన్ని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వాడితే కర్నూలు ఆసుపత్రిలో ఆరుగురి ఊపిరి ఆగిపోయేది కాదు' అని లోకేశ్ చెప్పారు.
'అధికారులు, పోలీసులు, వాలంటీర్లను వాడుకుని తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడంపై పెట్టిన శ్రద్ధ ప్రాణవాయువు అందించే దానిపై పెట్టి వుంటే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో 10 మంది చనిపోయేవారు కాదు' అని లోకేశ్ ట్వీట్ చేశారు.
'టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ఏదో ఒక అక్రమకేసు పెట్టి అరెస్ట్ చేయించాలని చేస్తున్న ప్రయత్నాలు, ఉత్తరాంధ్రలోని ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాల కల్పనపై పెట్టి వుంటే విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కొవిడ్ పేషెంట్లు చనిపోయి వుండేవారు కాదు' అని లోకేశ్ చెప్పారు.
'ప్రజలకి రక్షగా ఉంటావని ఎన్నుకుంటే, ప్రతిపక్షంపై కక్ష తీర్చుకుంటున్నావు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నిన్ను నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా క్షమించడు వైఎస్ జగన్. హిందూపూర్ ఘటన పై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి. ప్రభుత్వ హత్యలకు జగన్ రెడ్డి బాధ్యత వహించాలి' అని లోకేశ్ తెలిపారు.