Etela Rajender: ఈటల కుటుంబ సభ్యుల అత్యవసర పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు
- సర్వే చేసేముందు తమకు నోటీసు ఇవ్వలేదన్న ఈటల కుటుంబం
- ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వాదనలు
- ఈటలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందునే విచారణ
- సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించిన హైకోర్టు
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు కలకలం రేపుతోన్న నేపథ్యంలో రెండు రోజుల క్రితం జరిపిన భూముల సర్వే పారదర్శకంగా జరగలేదని ఈటల రాజేందర్ కుటుంబం హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారు వేసిన అత్యవసర పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి.
ఈటల కుటుంబం తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. సర్వే చేసేముందు తమకు నోటీసు ఇవ్వలేదని ఈటల కుటుంబం తెలిపింది. అధికారులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని పేర్కొంది. కలెక్టర్ నివేదికను కూడా తమకు ఇవ్వలేదని చెప్పింది.
ఆ తర్వాత ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈటల రాజేందర్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందునే విచారణ జరుపుతున్నారని వివరించారు. అయితే, సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా? అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిచింది. అలాగే, రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయిందని నిలదీసింది.
ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా? అని ప్రశ్నించింది. అధికారులు రూపొందించిన నివేదికపై పలు అభ్యంతరాలు తెలిపింది. అయితే, ఈటల భూములపై ప్రాథమిక విచారణ మాత్రమే చేసినట్లు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఈ విషయంపై తదుపరి చర్యలు చట్ట ప్రకారమే ఉంటాయని కలెక్టర్ నివేదికలో తెలిపారని అన్నారు. పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది.