Etela Rajender: 'నేనే రాజీనామా చేసే వాడిని'.. సంచలన విషయాలు తెలిపిన ఈటల రాజేందర్
- తెలంగాణ గాంధీగా పేరు గాంచిన వ్యక్తి ఇప్పుడు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు
- అసలు ప్రగతి భవన్లో సీఎంను కలిసే అవకాశం మంత్రులకు ఉండదు
- గతంలో సీఎంను కలవడానికి వెళ్తే ఆపేశారు
- ఇంత అహంకారమా? అని గంగుల కమలాకర్ అన్నారు
- ఇటువంటివి చాలా ఉన్నాయి
తన వ్యవహారం నచ్చకపోతే తనను పిలిపించి అడిగితే టీఆర్ఎస్ పార్టీ కోరితే తానే రాజీనామా చేసేవాడినని తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. అంతేగానీ, ఇంత కక్ష సాధించడం అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. తాను తప్పు చేస్తే విచారణ జరిపించాలని ఇప్పటికే స్పష్టం చేశానని చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో పలువురు కార్యకర్తలు, మద్దతుదారులతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
ఇప్పుడు తనను విమర్శిస్తున్నవారంతా తన సహచరులేనని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ గాంధీగా పేరు గాంచిన వ్యక్తి ఇప్పుడు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎవరో ఇస్తున్న తప్పుడు సలహాలు, నివేదికల వల్ల నాపై కక్ష సాధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
అసలు ప్రగతి భవన్లో సీఎంను కలిసే అవకాశం కూడా మంత్రులకు ఉండదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. సీఎంకు ఆరోగ్యం బాగోలేదని తెలిసి మంత్రులు ఆయనను కలవడానికి వెళ్లారని, అయితే, ఆయనను కలిసేందుకు అనుమతించలేదని చెప్పారు.
తెలంగాణ రాకముందు వరకే కేసీఆర్.. ప్రజలను, ధర్మాన్ని నమ్ముకున్నారని, ఆ తర్వాత మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2014 నుంచి ప్రజా సంక్షేమం కోసం తాను ఎలా పని చేశానో ప్రజలందరికీ తెలుసని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము ఎంతగానో కష్టపడ్డామని, కరీంనగర్ జిల్లా నుంచి ఎంతో సాయాన్ని అందించామని తెలిపారు.
2015లో తాను కరీంనగర్ సమస్యల గురించి వివరించడానికి సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లానని, సీఎంను కలవకుండా నిలువరించారని చెప్పారు. బయట అంతా మీడియా వాళ్లు ఉన్నారని, వారు చూస్తున్నారని, సీఎంను కలవనివ్వకపోయినా ఒక్కసారి లోపలికి వెళ్లి బయటకు వచ్చేస్తామని చెప్పామని వెల్లడించారు.
కనీసం అలా చేయపోతే మీడియా ముందు తమ సిగ్గుపోతుందని చెప్పుకున్నామని అయినప్పటికీ లోపలికి వెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదని వివరించారు. ఆ సమయంలో సహచర నేత గంగుల కమలాకర్‌కు కోపం వచ్చిందని, ఇంత అహంకారమా? అని అన్నారని ఆయన వెల్లడించారు. ఇటువంటివి చాలా ఉన్నాయని అవి చెప్పలేమని అన్నారు. తనకు మద్దతు తెలపాలని తాను టీఆర్ఎస్ నేతలను అడగడం లేదని చెప్పారు.