Mamata Banerjee: బెంగాల్‌లో ఘర్షణలపై ఆరా తీసిన మోదీ!
- ప్రధాని తనకు ఫోన్ చేశారని తెలిపిన గవర్నర్
- ఘటనపై తీవ్ర ఆవేదన చెందారని వెల్లడి
- ఇప్పటి వరకు 12 మంది మృతి!
- విచారణకు ఆదేశించిన కేంద్ర హోంశాఖ, గవర్నర్
పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ఫలితాల అనంతరం తలెత్తిన ఘర్షణలపై ప్రధాని నరేంద్ర మోదీ తనకు కాల్ చేసి ఆరా తీశారని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్ తెలిపారు. పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో చోటు చేసుకున్న విధ్వంసం, హింస, కాల్పులు, దోపిడీకి సంబంధించి తన ఆందోళనను ప్రధానికి వివరించానని తెలిపారు. పరిస్థితిని వెంటనే అదుపులోకి తేవాలని సంబంధిత యంత్రాంగాన్ని ధన్‌కర్ ఈ సందర్భంగా కోరారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తమ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడ్డారని బీజేపీ ఆరోపించిన విషయం తెలిసిందే. అలాగే పలు చోట్ల బీజేపీ కార్యాలయాలను తగలబెట్టారని ఆరోపించారు. ఈ ఘటనల్లో ఇప్పటి వరకు 12 మంది చనిపోయినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర హోంశాఖ విచారణకు ఆదేశించింది. అలాగే గవర్నర్ ధన్‌కర్ సైతం దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ను కోరారు. మరోవైపు హింసాత్మక ఘటనలపై విచారం వ్యక్తం చేసిన దీదీ అందరూ ప్రశాంతంగా ఉండాలని పిలుపునిచ్చారు.