Bandi Sanjay: బెంగాల్లో బీజేపీ కార్యకర్తలు తిరగబడితే టీఎంసీ పరిస్థితేంటి?: బండి సంజయ్
- బీజేపీ శ్రేణులపై టీఎంసీ దాడులకు పాల్పడుతోంది
- బెంగాల్ లో రాక్షసకాండ కొనసాగుతోంది
- మమత ఆమె పేరును మమతాబేగంగా మార్చుకోవాలి
పశ్చిమబెంగాల్ లో ఘన విజయాన్ని సాధించిన మమతా బెనర్జీపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత బెంగాల్ లో బీజేపీ శ్రేణులపై టీఎంసీ దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఈ ఘటనలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలను చేపట్టబోతున్నట్టు తెలిపారు.
రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు బెంగాల్ ను అడ్డాగా మమత మార్చారని సంజయ్ మండిపడ్డారు. బెంగాల్ లో రాక్షసకాండ కొనసాగుతోందని... ఒక రాక్షసి మాదిరి మమత ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. గతంలో 3 సీట్లు మాత్రమే బీజేపీకి ఉండేవని... ఈ ఎన్నికల్లో తమ పార్టీ స్థానాలు భారీగా పెరిగాయని చెప్పారు. బెంగాల్లో బీజేపీ విస్తరిస్తోందని తెలిపారు.
ఇక, మమతా బెనర్జీ మమతా బేగంగా పేరు మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. రోహింగ్యాలు ఇచ్చిన నిధులను మమత ఎన్నికల్లో ఖర్చు చేశారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు తిరగబడితే మమత పరిస్థితి దారుణంగా ఉంటుందని అన్నారు. బెంగాల్ లో కరసేవ చేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. బెంగాల్ బీజేపీ కార్యకర్తలకు తాము పూర్తి మద్దతును తెలియజేస్తున్నామని చెప్పారు.