Andhra Pradesh: ఇది విమర్శ కాదు.. వేదన: చంద్రబాబునాయుడు
- కేబినెట్ భేటీలో కరోనా గురించి మాట్లాడరా?
- ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు
- ఎన్-440 వేరియంట్ గురించి తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించింది
కరోనా మహమ్మారి వేళ ప్రజల ప్రాణాలు కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రభుత్వాన్ని విమర్శించాలన్నది తమ ఉద్దేశం కాదని, ఈ రోజు తాను ఆవేదనతో మాట్లాడుతున్నానని అన్నారు.
కొద్దిసేపటి క్రితం జూమ్ ద్వారా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. కొవిడ్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును దునుమాడారు. కర్నూలు జిల్లాలో గుర్తించిన ఎన్-440 వేరియంట్ గురించి తెలంగాణ హైకోర్టు కూడా హెచ్చరించిందని గుర్తు చేశారు. ఏపీ కేబినెట్ భేటీలో కరోనా ప్రస్తావన లేకపోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో బెడ్లు, వెంటిలేటర్ల కొరత లేదని ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందన్నారు.
టీడీపీ తరపున కొవిడ్ రోగులకు సాయం అందిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. వ్యాక్సినేషన్ల విషయంలోనూ ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. టీకాల విషయంలో ముఖ్యమంత్రి సమీక్ష జరపాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. తమ కార్యాలయంలో కరోనా బారినపడి వారికి అమెరికా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్టు చంద్రబాబు వివరించారు.