Corona Virus: టీకా కోసం వారం రోజుల్లో 3.5 కోట్ల మంది రిజిస్ట్రేషన్‌.. అందింది మాత్రం 2 శాతం మందికే!

above 3 Crore Registered for vaccine only 2pc got it

  • ఏప్రిల్‌ 28న ప్రారంభమైన రిజిస్ట్రేషన్‌
  • టీకాలపై 18-44 మధ్య వయసు వారిలో ఆసక్తి
  • వేధిస్తున్న టీకాల కొరత
  • కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులోకి
  • రానున్న రోజుల్లో భారీ ఎత్తున టీకాలు అందే అవకాశం

మూడో విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా ఏప్రిల్‌ 28న రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన విషయం తెలిసిందే. వారంలోపు దాదాపు 3.5 కోట్ల మంది టీకా కోసం కొవిన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కానీ, 18-44 ఏళ్ల మధ్య వయసుగల వీరిలో కేవలం రెండు శాతం మందికి మాత్రమే ఇప్పటి వరకు టీకాలు అందినట్లు తెలుస్తోంది. టీకాల కొరత వల్లే వ్యాక్సినేషన్‌ మందకొడిగా సాగుతున్నట్లు సమాచారం.

టీకాల కోసం తొలుత ఆర్డర్‌ చేసిన రాష్ట్రాలకు ముందుగా వ్యాక్సిన్లు అందాయి. దీంతో ఆయా రాష్ట్రాలు ముందుగానే వ్యాక్సినేషన్‌ను ప్రారంభించగలిగాయి. 18-44 ఏళ్ల కేటగిరిలో గుజరాత్‌లో 1.61 లక్షల మందికి, రాజస్థాన్‌లో 1.26 లక్షలు, మహారాష్ట్రలో 1.11 కోట్ల మందికి టీకాలు అందినట్లు తెలుస్తోంది. గుజరాత్‌, రాజస్థాన్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్‌ అందుబాటులో ఉండగా.. మహారాష్ట్రలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ రెండూ ప్రజలకు అందాయి. ఇక హర్యానాలో దాదాపు లక్ష మందికి టీకా అందగా.. ఢిల్లీలో 80 వేల మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

ఇక జమ్మూకశ్మీర్‌, ఒడిశా, తమిళనాడు, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక రాష్ట్రాల్లో మూడో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. అయితే, కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు భారీ ఎత్తున టీకాల కోసం ఆర్డర్లు పెట్టాయి. అవన్నీ రానున్న రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి.

మరోవైపు రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి టీకా సైతం భారత్‌కు చేరుకుంది. రానున్న నెలల్లో భారీ ఎత్తున ఈ టీకాలు భారత్‌కు అందనున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న మరికొన్ని వారాల్లో వ్యాక్సినేషన్‌ వేగవంతం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే ఫైజర్‌ సైతం తమ టీకాను భారత్‌లో వినియోగించేందుకు సంబంధించిన అనుమతులపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.

  • Loading...

More Telugu News