New Delhi: ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌పై హత్యకేసు.. గాలిస్తున్న పోలీసులు
- తుపాకితో కాల్పులు జరిపిన ఓ వర్గం
- 23 ఏళ్ల జాతీయ స్థాయి మాజీ జూనియర్ రెజ్లర్ మృతి
- తనకు సంబంధం లేదన్న సుశీల్ కుమార్
ఢిల్లీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ రెజ్లర్ మరణించడం కలకలం రేపుతోంది. రాజధానిలోని ఛత్రసాల్ స్టేడియం వద్ద మంగళవారం రాత్రి రెండు వర్గాల రెజ్లర్ల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మరో వర్గం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన రెజ్లర్లను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాగర్ కుమార్ అనే 23 ఏళ్ల జాతీయ స్థాయి మాజీ జూనియర్ రెజ్లర్ మరణించాడు.
ఈ సందర్భంగా ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సుశీల్ కుమార్, అతడి సహచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. అయితే, ఈ ఘటనకు, తనకు ఎలాంటి సంబంధం లేదని సుశీల్ కుమార్ పేర్కొన్నాడు. సుశీల్ కుమార్ కోసం పలు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయని అదనపు డీసీపీ డాక్టర్ గురిక్బాల్ సింగ్ సిద్ధూ తెలిపారు. సుశీల్ కుమార్, అతడి సన్నిహితులే ఈ నేరానికి పాల్పడినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.