Jammu And Kashmir: కరోనాతో మృతి చెందిన కశ్మీర్ వేర్పాటువాద నేత మహ్మద్ అష్రఫ్

Jailed Kashmiri separatist leader Mohammad Ashraf Sehrai dies

  • ప్రజాభద్రతా చట్టం కింద గతేడాది అరెస్ట్ అయిన అష్రఫ్
  • పరిస్థితి క్షీణించడంతో కోట్‌బల్వాల్ జైలు నుంచి ఆసుపత్రికి తరలింపు
  • ఉగ్రవాదంలో చేరిన ఆయన కుమారుడు గతేడాది ఎన్‌కౌంటర్‌లో హతం

కశ్మీర్ సీనియర్ వేర్పాటువాద నేత, తెహ్రీక్-ఇ-హురియత్ చైర్మన్ మహ్మద్ అష్రఫ్ సెహ్రాయ్ కరోనాతో కన్నుమూశారు. ప్రజాభద్రతా చట్టం (పీఎస్ఏ) కింద గతేడాది జులైలో అష్రఫ్ అరెస్టయ్యారు. జమ్ము జైలులో ఉన్న 77 ఏళ్ల అష్రఫ్‌లో ఇటీవల కరోనా లక్షణాలు బయపడ్డాయి. కోట్‌బల్వాల్ జైలులో ఉన్న అష్రఫ్ పరిస్థితి క్షీణించడంతో మంగళవారం ఆయనను జమ్ములోని ప్రభుత్వ మెడికల్ కాలేజీకి తరలించారు. ఆక్సిజన్ స్థాయులు పడిపోయి, ఆరోగ్యం క్షీణించడంతో నిన్న మరణించినట్టు హురియత్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సయీద్ అలీ షా గిలానీ తెలిపారు.

కుప్వారాలోని టేకిపొరాకు చెందిన అష్రఫ్.. తెహ్రీక్-ఇ-హురియత్‌ మాజీ చైర్మన్ సయ్యద్ అలీ గిలానీకి అత్యంత సన్నిహితుడు. మార్చి 2018లో ఆయన చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత ఈ వేర్పాటువాద గ్రూపు పగ్గాలను అష్రఫ్ చేపట్టారు. ఎంబీయే చదువుకున్న ఆయన కుమారుడు జునైద్ సెహ్రాయ్ ఉగ్రవాదులలో చేరాడు. గతేడాది శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాల చేతిలో హతమయ్యాడు.

  • Loading...

More Telugu News