Karnataka: కరోనా కంట్రోల్ కావడం లేదు.. పూర్తి లాక్ డౌన్ విధించాలనుకుంటున్నాం: కర్ణాటక ఆరోగ్యమంత్రి
- కర్ఫ్యూ విధించినా కరోనా కంట్రోల్ కాలేదు
- రోజూ వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి
- లాక్ డౌన్ విధించడం మినహా మరోదారి లేదు
కర్ణాటకలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 12 వరకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. అయినప్పటికీ కొత్త కేసులు నమోదు కావడం తగ్గలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య మంత్రి సుధాకర్ కీలక ప్రకటన చేశారు. కర్ఫ్యూ విధించినా కరోనా కంట్రోల్ కాలేదని.. రోజూ వేల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం విధించిన నిబంధనలను ప్రజలు సంపూర్ణంగా అమలు చేయడం లేదని చెప్పారు.
ఉదయం నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు అనుమతిస్తే... ఎక్కడ చూసినా గుంపులుగుంపులుగా జనాలు పోగవుతున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించడం మినహా మరోదారి లేదని చెప్పారు. ఈ నెల 12 తర్వాత సంపూర్ణ లాక్ డౌన్ విధించాలని నిర్ణయించామని తెలిపారు.
18 ఏళ్లు పైబడిన వారికి ఈ నెల 15 తర్వాత వ్యాక్సిన్ వేస్తామని మంత్రి చెప్పారు. కరోనా నియంత్రణ బాధ్యతలను ఐదుగురు సీనియర్ మంత్రులకు అప్పగించడంపై తనకు అసంతృప్తి లేదని... ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో అన్నిటినీ ఒకరే పర్యవేక్షించడం కష్టమని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సరికాదని చెప్పారు.