Andhra Pradesh: ఏపీలో మరో 17,188 కరోనా కేసులు, 73 మరణాలు
- కరోనా టెస్టుల సంఖ్యను బాగా పెంచిన ప్రభుత్వం
- గత 24 గంటల్లో 1,00,424 కరోనా టెస్టులు
- చిత్తూరు జిల్లాలో 2,260 కొత్త కేసులు
- విజయనగరం జిల్లాలో 11 మంది మృతి
- ఇంకా 1,86,695 మందికి చికిత్స
ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం మరింత పెంచింది. గడచిన 24 గంటల్లో 1,00,424 కరోనా పరీక్షలు నిర్వహించగా 17,188 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 2,260 పాజిటివ్ కేసులు నమోదు కాగా, విశాఖ జిల్లాలో 1,868 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 385 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 12,749 మంది కరోనా నుంచి కోలుకోగా, 73 మంది మరణించారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 11 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12,45,374 పాజిటివ్ కేసులు నమోదు కాగా 10,50,160 మంది కోలుకున్నారు. ఇంకా 1,86,695 మంది చికిత్స పొందుతున్నారు. తాజా మరణాలతో కలిపి ఏపీలో కరోనా మృతుల సంఖ్య 8,519కి పెరిగింది.