COVID19: కొవిడ్ తో పాటే కొత్త రోగాలు... కంటిచూపు పోగొట్టుకున్న బాధితులు!
- సూరత్ లో 8 మందికి కంటిచూపు పోయిన వైనం
- కరోనా నుంచి కోలుకున్నా కంటి జబ్బు
- బ్లాక్ ఫంగస్ గా గుర్తించిన డాక్టర్లు
- ఔషధాల వలనే ఫంగస్ వస్తుందని వెల్లడి
కరోనా వైరస్ సోకిందంటే శరీరంలోని కీలక అవయవాల పనితీరు బాగా దెబ్బతింటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ, ఆ వైరస్ మహమ్మారి కలిగించిన నష్టంతో అనేక మంది కోలుకోలేక మృత్యువాత పడుతున్నారు. కాగా, కరోనా వైరస్ సోకిన వ్యక్తి అనేక ఇతర జబ్బులకు కూడా గురవుతున్నట్టు వైద్యులు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న 8 మంది వ్యక్తులకు కంటిచూపు పోయిన ఘటన గుజరాత్ లోని సూరత్ లో జరిగింది. కరోనా నుంచి కోలుకున్న ఆ వ్యక్తులు కంటిచూపు కోల్పోయారు.
వారిని పరిశీలించిన వైద్య నిపుణులు, మ్మూకోర్మిసిస్ అనే బ్లాక్ ఫంగస్ కంటిచూపును హరించివేసిందని గుర్తించారు. కాగా, ఈ ఫంగస్ ఎంతో ప్రమాదకరమని, కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం హరించివేస్తుందని డాక్టర్లు పేర్కొన్నారు. దీనిపై ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రి ఈఎన్ టీ విభాగం హెడ్ డాక్టర్ అజయ్ స్వరూప్ స్పందించారు. కరోనా చికిత్సకు వాడే ఔషధాల వల్ల బ్లాక్ ఫంగస్ ఏర్పడుతుందని తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశం మొత్తమ్మీద 40 మంది వరకు బ్లాక్ ఫంగస్ బారినపడ్డారని నివేదికలు చెబుతున్నాయి.