Rajiv Kumar: ప్రకంపనలు సృష్టిస్తున్న మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు.. మనస్తాపంతో ఎన్నికల కమిషనర్ రాజీనామా?
- కరోనా విజృంభణకు ఎన్నికల కమిషనే కారణమన్న హైకోర్టు
- తమ పరువు పోయిందంటూ సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈసీ
- అఫిడవిట్ దాఖలు చేసేందుకు సిద్ధమైన రాజీవ్ కుమార్
- అడ్డుకున్న ప్రధాన ఎన్నికల కమిషనర్
- ఎన్నికల విధుల నుంచి తప్పుకున్న మోహిత్ రామ్
కరోనా వ్యాప్తికి ఎన్నికల కమిషనే కారణమంటూ మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యల ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. కరోనా మహమ్మారి మళ్లీ చెలరేగిపోవడానికి ఎన్నికల కమిషనే కారణమని, కాబట్టి కమిషన్‌పై హత్యా నేరం మోపాలని కోర్టు అంతర్గతంగా వ్యాఖ్యానించింది. ఇవి మీడియాలో రావడంతో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టులో రికార్డు కాని వ్యాఖ్యలను ప్రచురించకుండా మీడియాను నియంత్రించాలని కోరింది. విచారించిన కోర్టు.. ఈ విషయంలో మీడియాపై తాము ఆంక్షలు విధించలేమని, ఇలాంటి ఫిర్యాదులు చేయడానికి బదులు మరింత మెరుగ్గా పనిచేయవచ్చని చురకలు అంటించింది.
ఇదిలా ఉండగా, మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలతో తీవ్ర మనస్తాపం చెందిన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధపడినట్టు సమాచారం. అంతేకాదు, కోర్టు వ్యాఖ్యలకు నిరసనగా అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. అయితే, ఇందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ అంగీకరించలేదని సమాచారం. మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలతో కమిషన్ తరపున పనిచేస్తున్న 11 లక్షల మంది సిబ్బంది నైతిక స్థైర్యం దెబ్బతిన్నదని రాజీవ్ కుమార్ ఆ అఫిడవిట్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు, సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ తరపున వాదిస్తున్న ప్యానల్ న్యాయవాది మోహిత్ డి. రామ్ ఆ విధుల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఎన్నికల కమిషన్ ప్రస్తుత విధానాలతో తనకు సరిపడడం లేదని రాజీనామా సందర్భంగా ఆయన పేర్కొన్నారు.