CoWin App: కొవిన్ యాప్లో నయా ఫీచర్.. ఇక కోడ్ చెబితేనే టీకా!
- కొవిన్ యాప్లో ఇబ్బందులకు చెక్
- రిజిస్ట్రేషన్ సమయంలో 4 అంకెల సెక్యూరిటీ కోడ్
- పలు సమస్యలకు చెక్ పడుతుందన్న కేంద్రం
కొవిన్ యాప్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కేంద్ర ఆరోగ్యశాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ఓ సెక్యూరిటీ కోడ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత రిజిస్టర్డ్ మొబైల్కు నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్ వస్తుంది. వ్యాక్సినేషన్ సమయంలో అది చెబితేనే టీకా వేస్తారు. లేదంటే లేదు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ మాట్లాడుతూ.. సెక్యూరిటీ పరమైన లోపాలతోపాటు వ్యాక్సిన్ దుర్వినియోగాన్ని నివారించేందుకు ఈ సరికొత్త ఫీచర్ ఉపయోగపడుతుందని పేర్కొంది.
నిజానికి కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ కొంత గందరగోళంతో కూడుకున్న పనే. లబ్ధిదారులకు సరైన పరిజ్ఞానం లేకపోవడంతో చాలామంది రిజిస్ట్రేషన్ చేసుకోలేకపోతున్నారు. మరికొందరు చచ్చీచెడీ స్లాట్ బుక్ చేసుకున్నా సమయానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లకపోవడంతో వ్యాక్సిన్ వేయించుకున్నట్టు (వ్యాక్సినేషన్ కంప్లీటెడ్) మెసేజ్ వస్తోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ఈ సెక్యూరిటీ ఫీచర్ను తీసుకొచ్చింది.