Nara Lokesh: జగన్ కు సొంత బ్రాండ్ల మద్యం అమ్మకాలపై ఉన్న ఆరాటం ప్రజల ఆరోగ్యంపై లేదు: లోకేశ్
- మద్యం దుకాణాల వద్ద భౌతికదూరం అమలు
- కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద తొక్కిసలాటలు
- తీవ్రంగా స్పందించిన నారా లోకేశ్
- ప్రజలను దొమ్మీకి వదిలేశారని ఆగ్రహం
- కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని మండిపాటు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ధ్వజమెత్తారు. కరోనా వ్యాక్సిన్ కేంద్రాల వద్ద విపరీతమైన రద్దీ నెలకొని, ప్రజలు భౌతికదూరం నిబంధన పాటించలేని పరిస్థితులు ఏర్పడడం పట్ల లోకేశ్ తీవ్రంగా స్పందించారు. జగన్ కు తన సొంత బ్రాండ్ల మద్యం అమ్మకాలపై ఉన్న ఆరాటం ప్రజల ఆరోగ్యంపై లేదని విమర్శించారు. తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం అంటూ వ్యాఖ్యానించారు.
మద్యం దుకాణాల వద్ద క్యూలు ఏర్పాటు చేసి భౌతికదూరం అమలు చేస్తున్నారని, కరోనా నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సిన్ కోసం వచ్చిన ప్రజలను మాత్రం దొమ్మీకి వదిలేశారని మండిపడ్డారు. తద్వారా మరింతగా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో చోటు చేసుకున్న వివిధ ఘటనల వీడియోలను కూడా పంచుకున్నారు.