Konda Vishveshwar Reddy: సీఎం అయ్యే అర్హత కేటీఆర్ కు లేదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- కేటీఆర్ మంచి వ్యక్తి అయినా.. సీఎం అయ్యే అర్హత లేదు
- హరీశ్, ఈటలకు ఆ అర్హతలు ఉన్నాయి
- టీఆర్ఎస్ నాయకులతో నాకు విభేదాలు లేవు
తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లేవని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రానికి సీఎం అయ్యే అర్హత కేవలం ఇద్దరికి మాత్రమే ఉందని... వారు హరీశ్ రావు, ఈటల రాజేందర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా కొంత వరకు ఆ అర్హత ఉందని అన్నారు. వ్యక్తిగతంగా చూస్తే కేటీఆర్ చాలా మంచి వ్యక్తి అని... అయితే ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు మాత్రం ఆయన సరైన వ్యక్తి కాదని చెప్పారు.
టీఆర్ఎస్ నాయకులతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని విశ్వేశ్వర్ రెడ్డి వివరించారు. కాంగ్రెస్ పార్టీలో తనకు శత్రువులు ఎవరూ లేరని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలహీనపడిందని... అధికార టీఆర్ఎస్ ను ఎదుర్కోలేకపోతోందని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జి మాణికం ఠాగూర్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వివరించానని చెప్పారు.