Asaduddin Owaisi: ప్రధాని అసమర్థత వల్ల వేలమంది చనిపోతున్నారు: అసదుద్దీన్ ఒవైసీ
- భారత్ లో నిత్యం లక్షల్లో కరోనా కేసులు
- వేల మంది మృత్యువాత
- ప్రధాని బాధ్యతల నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యలు
- అంతర్రాష్ట్ర మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్
- వీడియో కాన్ఫరెన్స్ లతో లాభంలేదన్న ఒవైసీ
దేశంలో కొవిడ్ సంక్షోభం తీవ్ర రూపుదాల్చడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ప్రజలకు ఆక్సిజన్ సమకూర్చడం, వ్యాక్సిన్లు అందించడం, ప్రాణాధార ఔషధాలు, వైద్యచికిత్స వ్యవస్థలను అందుబాటులోకి తేవడం ప్రధాని బాధ్యత అని ఒవైసీ స్పష్టం చేశారు. కానీ ప్రధాని అసమర్థత, తన విధుల పట్ల నిర్లిప్తత కారణంగా దేశంలో వేలమంది చనిపోతున్నారని విమర్శించారు.
రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఆర్టికల్ 263 ప్రకారం ప్రధాని మోదీ అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని ఒవైసీ డిమాండ్ చేశారు. తద్వారా రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయానికి కృషి చేయాలని సూచించారు. కేవలం వీడియో కాన్ఫరెన్స్ లు ఏర్పాటు చేసినంత మాత్రాన ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.