Corona Virus: నేటి మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంటుందని హైకోర్టుకు తెలిపిన ఏజీ!
- కరోనా పరీక్షలు తగ్గడంపై హైకోర్టు ఆగ్రహం
- అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరిక
- కరోనా నియంత్రణకు తీసుకునే తదుపరి చర్యలు ఏమిటని ప్రశ్న
- తమ ఆందోళనను కేబినెట్ దృష్టికి తీసుకెళ్లాలన్న కోర్టు
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరీక్షలు తగ్గడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇస్తామని హెచ్చరించింది. పరీక్షల సంఖ్యను పెంచాలని చెబితే, ఇంకా తగ్గిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించింది.
రాత్రి కర్ఫ్యూ సరిగ్గా అమలు కావట్లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా నిబంధనల ఉల్లంఘనల గురించి మీడియాలో ఆధారాలతో పాటు వార్తలు వస్తున్నాయని గుర్తు చేసింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై రంజాన్ తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారా? అంటూ హైకోర్టు ప్రశ్నించడం గమనార్హం.
మతపరమైన ప్రదేశాల్లో జన సమీకరణ సరికాదని చెప్పింది. ప్రభుత్వం కోర్టుకు చెబుతోన్న విషయాలకు, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు పొంతన లేదని, వారాంతపు కర్ఫ్యూ పెట్టాలని సూచిస్తే అవసరం లేదన్నారని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి కరోనా చికిత్సకు వచ్చే అంబులెన్సులను తెలంగాణ పోలీసులు నిలిపేస్తుండడం పట్ల న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా విపత్తు వేళ అంబులెన్సులను నిలిపి వేయడం మానవత్వమేనా? అని ప్రశ్నించింది. కరోనా నియంత్రణకు తీసుకునే తదుపరి చర్యలు ఏంటో చెప్పాలని, అలాగే, కింగ్‌కోఠిలో చోటు చేసుకుంటోన్న ఘటనలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
దీంతో అడ్వొకేట్ జనరల్ స్పందిస్తూ... ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. తమ ఆందోళనను కేబినెట్ దృష్టికి తీసుకెళ్లాలని ఏజీకి హైకోర్టు సూచించింది. కేబినెట్ భేటీ అయ్యే వరకు విచారణను వాయిదా వేయాలని ఏజీ కోరారు. విచారణను ఈ రోజు మధ్యాహ్నం 2.30 వరకే వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది.