KTR: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది: కేటీఆర్

Corona is declining in Telangana says KTR

  • సాధ్యమైనంత త్వరగా ప్రజలను కరోనా నుంచి బయటపడేయాలన్నదే మా ఆలోచన
  • రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను సమకూర్చుకుంటున్నాం
  • జిల్లాల పరిస్థితిని మంత్రులు సమీక్షిస్తున్నారు

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా ప్రభావం తక్కువగానే ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. అందరి సహకారంతో కరోనా గండం నుంచి గట్టెక్కేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. గతంలో తీవ్రత కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ... ప్రస్తుతం దాని తీవ్రత తగ్గుముఖం పట్టిందని అన్నారు.

ఈరోజు సెక్రటేరియట్ లో కరోనా పరిస్థితులపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ ఛైర్మన్ కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశానికి పలువురు అత్యున్నత స్థాయి అధికారులు హాజరయ్యారు. అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సాధ్యమైనంత త్వరగా ప్రజలను కరోనా నుంచి బయటపడేయాలన్నదే తమ ప్రభుత్వ ఆలోచన అని కేటీఆర్ చెప్పారు. కరోనా చికిత్సలో ఉపయోగించే మందులకు లోటు ఉండకూడదనే విషయంపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించామని తెలిపారు. ఇంటింటి సర్వే, హోమ్ ఐసొలేషన్ కిట్ల ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఏర్పడిందని చెప్పారు. రాబోయే మూడు నెలలకు సరిపడా ఔషధాలను సమకూర్చుకుంటున్నామని తెలిపారు.

రెమ్ డెసివిర్ ఇంజెక్షన్లను పూర్తి స్థాయిలో తెప్పించుకుంటున్నామని అన్నారు. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్న వారిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పారు. ప్రతి రోజు ఆక్సిజన్ ఆడిటింగ్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితులను మంత్రులు సమీక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన వ్యాక్సిన్లు, గ్లోబల్ టెండర్ల విషయంపై చర్చించామని తెలిపారు.

  • Loading...

More Telugu News