Corona Virus: ఈ ఏడాది చివరకు భారత్‌లో 200 కోట్ల కరోనా టీకా డోసులు అందుబాటులో ఉంటాయి: నీతి ఆయోగ్
- దేశంలో కొనసాగుతున్న కరోనా టీకాల కొరత
- నీతి ఆయోగ్ సభ్యుడు వికె.పాల్ నుంచి ఊరటనిచ్చే అంశం
- కొవిషీల్డ్ 75 కోట్లు, కొవాగ్జిన్ 55 కోట్లు అందే అవకాశం
- అనుమతి పొందని టీకాలు సైతం అప్పటికి అందుబాటులోకి వచ్చే సూచనలు
ఈ ఏడాది ఆగస్టు-డిసెంబరు మధ్య 200 కోట్ల కరోనా టీకా డోసులు భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వి.కె.పాల్ తెలిపారు. టీకా కొరత ఎదుర్కొంటున్న భారత్‌కు ఇది ఓ రకంగా ఊరటనిచ్చే అంశమనే చెప్పాలి. పాల్ చెప్పినట్లుగా ఆ డోసులన్నీ సకాలంలో భారత్‌కు చేరితే.. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగే అవకాశం ఉంటుంది.
ఇక 200 కోట్ల డోసుల్లో సీరం తయారు చేస్తున్న కొవిషీల్డ్ 75 కోట్లు, కొవాగ్జిన్ 55 కోట్లు వుంటాయని పాల్ వెల్లడించారు. అలాగే బయోలాజికల్-ఈ 30 కోట్లు, నొవావాక్స్ 20 కోట్లు, స్పుత్నిక్-వి 15.6 కోట్లు, భారత్ బయోటెక్ ముక్కు ద్వారా ఇచ్చే టీకా 10 కోట్లు, జైడస్ క్యాడిలా 5 కోట్లు, జెన్నోవాకు చెందిన టీకా డోసులు 6 కోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. వీటిలో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్-వి తప్ప మిగిలిన వాటి వినియోగానికి ఇంకా అనుమతి రావాల్సి ఉంది.