Dead Bodies: గంగానదిలో మృతదేహాలపై స్పందించిన ఎన్ హెచ్ఆర్సీ... యూపీ, బీహార్ లకు నోటీసులు
- గంగానదిలో తేలియాడుతున్న శవాలు
- బీహార్ లోని బక్సర్ జిల్లాలో 70 మృతదేహాల గుర్తింపు
- యూపీలో గంగా నది తీరంలో మృతదేహాల ఖననం
- కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు కూడా నోటీసులు
కరోనా వేళ పవిత్ర గంగానదిలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు దర్శనమివ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. బీహార్ లోని బక్సర్ జిల్లాలో 70 వరకు మృతదేహాలు నీటిపై తేలియాడుతూ కనిపించాయి. ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లాలోనూ గంగా నది తీరంలో అనేక మృతదేహాలను ఇసుకలో పూడ్చిన స్థితిలో గుర్తించారు. ఇవన్నీ కరోనా రోగుల మృతదేహాలేనని, వీటి ద్వారా కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందవచ్చని గంగా పరీవాహక రాష్ట్రాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
దీనిపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్సీ) స్పందించింది. యూపీ, బీహార్ రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. గంగా నదిలో శవాలు కొట్టుకురావడంపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. అంతేకాదు, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు కూడా నోటీసులు పంపింది. దీనిపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ స్పష్టం చేసింది. గంగానదిలో మృతదేహాలను పారవేయడం అంటే క్లీన్ గంగా ప్రాజెక్టును ఉల్లంఘించడమేనని, దీనిపై నిఘా ఉంచడంలో అధికారులు విఫలమైనట్టుగా కనిపిస్తోంనది ఎన్ హెచ్చార్సీ అభిప్రాయపడింది.