TTD: కొవిడ్ బాధితుల చికిత్స కోసం జర్మన్ హ్యాంగర్లు: ముందుకొచ్చిన టీటీడీ
- శ్రీ పద్మావతి కొవిడ్ ఆసుపత్రిలో జర్మన్ హ్యాంగర్ ఏర్పాటు
- రాష్ట్రవ్యాప్తంగా మరో 22 చోట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు
- ఒక్కో దాంట్లో 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసే అవకాశం
కరోనా మహమ్మారిపై పోరుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందుకొచ్చింది. కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు రాష్ట్రంలో 22 జర్మన్ హ్యాంగర్లు నిర్మించేందుకు రూ. 3.52 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి కొవిడ్ ఆసుపత్రి వద్ద ఇటీవల జర్మన్ హ్యాంగర్ నిర్మించి కొవిడ్ బాధితుల కోసం ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ నేపథ్యంలో ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలంటూ టీటీడీకి వినతులు వెల్లువెత్తాయి. స్పందించిన టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీ వేంకటేశ్వర సర్వశ్రేయనిధి నుంచి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో విశాఖ జిల్లాలో 4, అనంతపురం, కృష్ణా, గుంటూరుతోపాటు మరో జిల్లాలో మూడు చొప్పున, ప్రకాశం, కర్నూలు, మరో జిల్లాలో రెండు చొప్పున జర్మన్ హ్యాంగర్లు నిర్మిస్తారు. ఒక్కో దాంట్లో గరిష్ఠంగా 30 ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.