cyclone: 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న ‘తౌతే'.. ప్రధాని మోదీ కీలక సమావేశం
- లక్షద్వీప్ వద్ద అరేబియా సముద్రంలో అల్పపీడనం
- వాయుగుండంగా మారిందన్న అధికారులు
- ఈ రోజు అది ‘తౌతే’ తుపానుగా రూపాంతరం
- ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరాన్ని దాటే అవకాశం
- రాయలసీమలో భారీ వర్షాలు కురిసే చాన్స్
లక్షద్వీప్ వద్ద అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారిందని, ఈ రోజు అది ‘తౌతే’ తుపానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 18న గుజరాత్ వద్ద తీరాన్ని దాటే అవకాశముందని చెప్పారు.
దీంతో గంటకు 150 నుంచి 175 కి.మీటర్ల వేగంతో గాలులు వీయవచ్చని తెలిపారు. ప్రస్తుతం అమిని ద్వీపానికి ఈశాన్య దిశగా 160 కిలోమీటర్ల దూరంలో ‘తౌతే’ తుపాను ఉందని వివరించారు. అది మరింత బలపడి 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారనుందని తెలిపారు. దీని కారణంగా రాయలసీమలో భారీ వర్షాలు కురియవచ్చని తెలిపారు.
అలాగే, కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని చెప్పారు. కేరళలో ఇప్పటికే అప్రమత్తమైన ప్రభుత్వం తీర, లోతట్టు ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది.
మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తీర ప్రాంతాల్లో 53 బృందాలను మోహరించినట్టు ఎన్‌డీఆర్‌ఎఫ్ తెలిపింది.
కాగా, తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ కాసేపట్లో ఉన్నత స్థాయి సమావేశంలో పలు సూచనలు చేయనున్నారు. సంబంధిత ప్రభుత్వ అధికారులతో పాటు, సహాయక బృందాల అధికారులతో ఆయన చర్చించనున్నారు.