cpi: అక్రమ అరెస్టులకు పాల్పడటం సరికాదు: సీపీఐ రామకృష్ణ
- కరోనా వేళ కక్షపూరిత చర్యలు సరికాదు
- సర్కారు తప్పులను ఎత్తి చూపిన వారిపై బెదిరింపులు
- పాలనను ఎవరు విమర్శించినా చర్యలు తప్పబోవనే సంకేతాలు
ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఏపీ సర్కారు తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. సర్కారు పాల్పడుతోన్న తప్పులను ఎత్తి చూపిన వారిపై బెదిరింపులకు, అక్రమ అరెస్టులకు పాల్పడటం సరికాదని ఆయన అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేలా జరుగుతోన్న ఇలాంటి ఘటనలు ప్రమాదకరమని విమర్శించారు.
ఒకవైపు కరోనాతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరోవైపు, సీఎం జగన్ మాత్రం వాటి గురించి పట్టించుకోకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక ఎంపీని అరెస్టు చేయించడం ద్వారా తన పాలనను ఎవరు విమర్శించినా చర్యలు తప్పబోవంటూ హెచ్చరికలు జారీ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.