Spice Jet: కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ లేకుండా క్రొయేషియా వెళ్లిన భారత పైలెట్లు... 40 గంటల పాటు విమానంలోనే!
- కరోనా నేపథ్యంలో అనేక దేశాల్లో కఠిన ఆంక్షలు
- నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే అనుమతి
- మంగళవారం ఢిల్లీ నుంచి క్రొయేషియా వెళ్లిన స్పైస్ జెట్ ప్లేన్
- ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోని పైలెట్లు
- ఎయిర్ పోర్టులోకి ప్రవేశాన్ని నిషేధించిన అధికారులు
కరోనా మహమ్మారి ప్రభావంతో అనేక దేశాలు తమ దేశంలో అడుగుపెట్టేవారిపై తీవ్రస్థాయిలో ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ క్రమంలో నిబంధనలు పాటించకపోతే చేదు అనుభవాలు ఎదుర్కోకతప్పదు. అందుకు ఈ ఘటనే ఉదాహరణ. స్పైస్ జెట్ కు చెందిన బోయింగ్ 737 విమానం గత మంగళవారం ఢిల్లీ నుంచి క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ వెళ్లింది. అయితే, ఆ స్పైస్ జెట్ విమానంలోని నలుగురు పైలెట్లను క్రొయేషియా అధికారులు తమ భూభాగంపై కాలుమోపేందుకు అంగీకరించలేదు. అందుకు కారణం వారివద్ద కొవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్లు లేకపోవడమే.
స్పైస్ జెట్ యాజమాన్యం ఢిల్లీలోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులు నిర్వహించి ఉంటే వారికా ఇబ్బంది తప్పేది. కానీ, వారికి కరోనా టెస్టులు చేయకపోవడంతో క్రొయేషియాలో ఊహించని అనుభవం ఎదురైంది. ఆ నలుగురు పైలెట్లకు జాగ్రెబ్ విమానాశ్రయంలో ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. దాంతో వారు తమ విమానంలోనే 40 గంటల పాటు గడపాల్సి వచ్చింది.
ఆ స్పైస్ జెట్ విమానం తిరిగి భారత్ వచ్చేటప్పుడు కూడా క్రొయేషియా అధికారులు తమ నిబంధనలు వర్తింపజేశారు. ఆ విమానంలో ఎక్కేందుకు ప్రయాణికులెవరినీ అనుమతించలేదు సరికదా, కనీసం సరకు రవాణా కూడా జరపనివ్వలేదు. దాంతో, ఆ నలుగురు పైలెట్లతోనే స్పైస్ జెట్ విమానం ఖాళీగా ఢిల్లీ తిరిగొచ్చింది.