ATM: ఏటీఎం నుంచి రూ.100కు బదులు రూ. 500 నోట్లు.. పరుగులు తీసిన జనం!
- వనపర్తి జిల్లాలోని అమరచింతలో ఘటన
- మూడు రోజులుగా రూ. 5.88 లక్షలు అదనంగా డ్రా
- స్వచ్ఛందంగా వెనక్కి ఇవ్వకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న బ్యాంకు అధికారులు
ఏటీఎం నుంచి వంద రూపాయల నోట్లకు బదులు రూ. 500 నోట్లు వస్తున్న విషయం తెలుసుకున్న జనం ఎగబడ్డారు. డబ్బులు డ్రా చేసుకునేందుకు పోటీలు పడ్డారు. తెలంగాణలోని వనపర్తి జిల్లా అమరచింతలో జరిగిందీ ఘటన. నిన్న ఓ వినియోగదారుడు ఇండియా వన్ ఏటీఎం నుంచి రూ. 4 వేలు డ్రా చేశాడు. అయితే, వంద నోట్లకు బదులు అన్నీ రూ. 500 నోట్లే బయటకు వచ్చాయి. లెక్కించి చూస్తే రూ. 20 వేలు ఉన్నాయి.
విషయం ఆనోటా ఈనోటా పడి స్థానికులకు చేరడంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు పరుగులు పెట్టారు. ఏటీఎం బయట బారులు తీరారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసు పెట్రోలింగ్ సిబ్బంది విషయం ఆరా తీశారు. వంద నోట్లకు బదులుగా రూ. 500 నోట్లు వస్తున్న విషయం తెలుసుకుని ఏటీఎంను మూయించి బ్యాంకు అధికారులకు సమాచారం అందించారు.
ఏటీఎం ట్రేలలో నగదును లోడ్ చేసినప్పుడు వంద రూపాయలు ఉంచాల్సిన ట్రేలో పొరపాటున రూ. 500 నోట్లు పెట్టడమే ఇందుకు కారణమని గుర్తించారు. గత మూడు రోజులుగా ఈ ఏటీఎం నుంచి వందకు బదులుగా రూ.500 నోట్లు డ్రా అవుతున్నట్టు తెలుసుకున్నారు. ఇలా మొత్తం రూ. 5.88 లక్షలు అదనంగా విత్ డ్రా అయినట్టు గుర్తించారు. అదనంగా డబ్బులు డ్రా చేసుకున్న వారు వెంటనే వాటిని అప్పగించాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని బ్యాంకు అధికారులు హెచ్చరించారు.