Covishield: కొవిషీల్డ్ రెండో డోసు కోసం వచ్చే వారిని తిప్పి పంపొద్దు: కేంద్రం
- కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని పెంచిన కేంద్రం
- 12-16 వారాలకు పొడిగింపు
- గతంలో టీకా తీసుకున్నవారు పాత వ్యవధి ప్రకారమే రిజిస్టర్
- ఆసుపత్రులకు వెళితే తిప్పి పంపుతున్న సిబ్బంది
- ఈ నేపథ్యంలో స్పష్టతనిచ్చిన కేంద్రం
సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్ టీకా రెండు డోసుల మధ్య విరామాన్ని కేంద్రం ఇటీవల పొడిగించిన విషయం తెలిసిందే. అయితే గతంలో తొలి డోసు తీసుకున్న వారు 4-6 వారాలుగా ఉన్న పాత వ్యవధి ప్రకారం రెండో డోసు కోసం కొవిన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే, వారంతా ఇప్పుడు ఆసుపత్రులకు వెళితే.. సిబ్బంది వారిని తిప్పి పంపుతున్నారు. రెండో డోసు తీసుకోవాల్సిన గడువును ప్రభుత్వం పెంచిందని చెబుతున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి రావడంతో దీనిపై స్పష్టతనిచ్చింది.
ఇప్పటికే రెండో డోసు కోసం రిజిస్టర్ చేసుకొని ఆసుపత్రికి వచ్చే వారిని తిప్పి పంపొద్దని స్పష్టం చేసింది. ఇప్పుడు తొలి డోసు తీసుకుంటున్నవారు కొవిన్‌లో రిజిస్టర్ చేసుకుంటే వారికి రెండో డోసు తీసుకోవాల్సిన తేదీ 84 రోజుల తర్వాతే వస్తుందని తెలిపింది. ఆ మేరకు కొవిన్‌లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు పంపినట్లు కేంద్రం వెల్లడించింది.
కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని 12-16 వారాలకు పెంచుతూ మే 13న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఈ గడువు 4-6 వారాలుగా ఉండేది.