AAG: రమేశ్ ఆసుపత్రికి తరలించడం అంటే టీడీపీ ఆఫీసుకు తరలించడమే: ఏఏజీ

AAG comments on Raghurama Krishna Raju issue
  • జీజీహెచ్ లో రఘురామకు వైద్య పరీక్షలు
  • హైకోర్టుకు చేరిన నివేదిక
  • రఘురామను రమేశ్ ఆసుపత్రికి తరలించాలన్న హైకోర్టు
  • వాదనలు వినిపించిన ఏఏజీ
  • జీజీహెచ్ నివేదిక వచ్చాక రమేశ్ ఆసుపత్రికి పంపడం సరికాదని వెల్లడి
ఎంపీ రఘురామకృష్ణరాజుకు జీజీహెచ్ లో నిర్వహించిన వైద్య పరీక్షల తాలూకు నివేదికపై హైకోర్టులో విచారణ జరగ్గా... ఆ నివేదికను హైకోర్టు న్యాయమూర్తులు చదివి వినిపించారు. ఎంపీ రఘురామ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని వైద్యబృందం ఆ నివేదికలో పేర్కొన్న విషయాన్ని గుర్తించారు. ఈ సందర్భంగా అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సీఐడీ కోర్టు ఆదేశాలను అమలు చేయాలని నిన్న సాయంత్రం 6.40 గంటలకు హైకోర్టు ఆదేశించిందని... ప్రైవేటు వైద్యులు, సీఆర్పీఎఫ్ భద్రతను హైకోర్టు నిరాకరించిందని ఏఏజీ వెల్లడించారు. హైకోర్టే స్వయంగా జీజీహెచ్ మెడికల్ బృందాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సీఐడీ కోర్టు నిన్న రాత్రి 8.30 గంటలకు చెప్పిందని అన్నారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత సీఐడీ కోర్టు ఆదేశాలు ఇచ్చిందని ఏఏజీ వివరించారు. హైకోర్టు ఆదేశాలను తమ ఏజీపీ సీఐడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.... హైకోర్టు ఆర్డర్ కాపీ ఇస్తే తీర్పు సవరిస్తామని సీఐడీ కోర్టు తెలిపిందని వెల్లడించారు.

రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లడం అంటే టీడీపీ ఆఫీసుకు తీసుకెళ్లడమేనని ఏఏజీ సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జీజీహెచ్ వైద్యులు నివేదిక ఇచ్చాక కూడా రమేశ్ ఆసుపత్రికి తరలించడం సరికాదని అభిప్రాయపడ్డారు. గతంలో రమేశ్ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్ల 10 మంది రోగులు చనిపోయారని, రమేశ్ ఆసుపత్రిపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని ఆరోపించారు.

దాంతో, రమేశ్ ఆసుపత్రిపై క్రిమినల్ కేసులు ఉంటే ఆ అంశంపై అఫిడవిట్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో, రమేశ్ ఆసుపత్రిపై అఫిడవిట్ దాఖలుకు సీఐడీ సన్నద్ధమవుతోంది. ఈ రాత్రికే అఫిడవిట్ దాఖలుకు సీఐడీ అధికారులు పత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు.
AAG
Ponnavolu Sudhakar Reddy
Raghu Rama Krishna Raju
Ramesh Hospitals
GGH

More Telugu News