Elephant: ఏడాదిన్నర కాలంగా శిక్ష అనుభవిస్తున్న ఏనుగుకు పెరోల్
- ఓ వ్యక్తిని హత్య చేసిన ఏనుగు మిత్తూ
- మావటికి బెయిలు.. ఏనుగుకు శిక్ష
- అనారోగ్యం బారినపడడంతో పెరోల్
ఓ హత్యకేసులో 18 నెలలుగా శిక్ష అనుభవిస్తున్న ఓ ఏనుగు ఎట్టకేలకు పెరోల్‌పై బయటకు రానుంది. అనారోగ్యంతో బాధపడుతున్న దానిని త్వరలోనే పార్కులో విడిచిపెట్టనున్నారు. గతేడాది అక్టోబరు 20న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ప్రదర్శన ఇచ్చి తిరిగి వస్తున్న సమయంలో కొందరు మిత్తూ అనే ఏనుగును వేధించారు. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఏనుగు వారిపై దాడిచేసి ఓ వ్యక్తిని చంపేసింది. దీంతో పోలీసులు ఏనుగుపైనా, దాని మావటిపైనా హత్యానేరం నమోదు చేశారు.
ఆ తర్వాత మావటికి బెయిలు లభించినప్పటికీ వ్యక్తిని చంపేసిన మిత్తూకు మాత్రం ఏడాదిన్నర శిక్ష పడింది. దీంతో దానిని బీహార్‌లోని చందౌలీ రాంనగర్ అటవీ జంతు సంరక్షణాలయ పర్యవేక్షణలో ఉంచారు. అప్పటి నుంచి అక్కడే బందీగా ఉండడం, దాని బాగోగుల గురించి పెద్దగా పట్టించుకోకపోవడంతో మిత్తూ అనారోగ్యం బారినపడింది. సరిగా నడవలేకపోతోంది. విషయం తెలిసిన వారణాసి కలెక్టర్ దానిని పెరోల్‌పై బయటకు తీసుకురావాలని నిర్ణయించారు. అనంతరం దానిని లిఖింపూర్ ఖేరీలోని దుద్వా జాతీయ పార్కులో విడిచిపెడతారు.