Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజు పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం.. వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహత్గి
- రఘురాజు తరపున ముకుల్ రోహత్గి, ఆదినారాయణరావు వాదనలు
- రఘురాజుపై 40 మంది పోలీసులు దాడి చేశారన్న రోహత్గి
- ఎఫ్ఐఆర్ లోని ఆరోపణలు బోగస్ అని వ్యాఖ్య
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. రఘురాజు తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి, ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుశ్యంత్ దవే, వి. గిరి వాదిస్తున్నారు.
ఈ సందర్భంగా రోహత్గి సుప్రీంకోర్టు దృష్టికి పలు విషయాలను తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజే విమర్శకుడిగా ఉన్నారని చెప్పారు. దీంతో, ఆయనను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని తెలిపారు. తనను తాను రక్షించుకోవడానికి రఘురాజు కేంద్ర బలగాల రక్షణను కూడా తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.
సొంత పార్టీ వ్యక్తుల నుంచే రఘురాజుకు రక్షణ కావాల్సి వచ్చిందని రోహత్గి చెప్పారు. తన క్లయింట్ కు సంబంధం లేని అంశంపై సీఐడీ పోలీసులు విచారణ చేస్తున్నారని అన్నారు. రాజద్రోహం కేసు నమోదు చేసేంత తీవ్రమైన ఆరోపణలను సీఎం జగన్ పై తన క్లయింట్ చేయలేదని చెప్పారు.
కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో టీవీ మాధ్యమాల ద్వారా ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేశారని రోహత్గి తెలిపారు. పుట్టినరోజు నాడే రఘురాజుపై 40 మంది పోలీసులు దాడి చేశారని చెప్పారు. రెండు టీవీ చానళ్లపై కూడా కేసు నమోదు చేశారని తెలిపారు. ఇదే సమయంలో సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లోని అంశాలను కూడా చదివి వినిపించారు. కేసులో విచారణాధికారే ఫిర్యాదుదారుడని చెప్పారు. ఎఫ్ఐఆర్ లోని ఆరోపణలన్నీ బోగస్ అని చెప్పారు.
కస్టడీలో రఘురాజును తీవ్రంగా కొట్టి, హింసించారని రోహత్గి తెలిపారు. తనకు తగిలిన గాయాలను మేజిస్ట్రేట్ కు కూడా రఘురాజు చూపించారని అన్నారు. రమేశ్ ఆసుపత్రికి తరలించాలని కింది కోర్టు కూడా ఆదేశించిందని తెలిపారు. తన క్లయింట్ కు బెయిల్ తో పాటు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్సకు అనుమతిని ఇవ్వాలని కోరారు.