Israel: ఇజ్రాయెల్ లో కూలిన ప్రార్థనా మందిరం.. ఇద్దరి మృతి, 160 మందికి పైగా గాయాలు
- షావూత్ ఫీస్ట్ సందర్భంగా మందిరానికి చేరుకున్న వేలాది మంది
- రెండు స్టాండులు కూలిపోవడంతో తొక్కిసలాట
- ఇక్కడ ప్రార్థనలు జరపొద్దని ముందే చెప్పామన్న ఆర్మీ కమాండర్
ఇజ్రాయెల్ లోని ఆక్రమిత వెస్ట్ బ్యాంకులో ఉన్న ప్రార్థనా మందిరం కూలిపోయిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోగా... 160 మందికి పైగా గాయపడ్డారు. మతపరమైన 'షావూత్ ఫీస్ట్' కార్యక్రమాన్ని పురస్కరించుకుని వేలాది మంది ఈ మందిరానికి చేరుకున్నారు. అయితే ఈ సందర్భంగా ఈ భవనం కోసం నిర్మించిన రెండు స్టాండ్లు కూలిపోవడంతో... అక్కడ నుంచి బయటపడేందుకు జనాలు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 40 ఏళ్ల వ్యక్తితో పాటు, 12 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
గాయపడిన వారిని ఇజ్రాయెల్ భద్రతా బలగాలు ఆసుపత్రులకు తరలించాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ఆర్మీ కమాండర్ ఒకరు మాట్లాడుతూ, ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరమని చెప్పారు. ప్రార్థనా మందిరం ఇంకా నిర్మాణ దశలోనే ఉందని, భవనం సురక్షితమైనది కాదని, ఇక్కడ ప్రార్థనలు జరపడానికి అనుమతి లేదని తాము ముందే హెచ్చరించామని తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.