AP High Court: ఏపీ ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
- మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్
- మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు నిలదీత
- సీఐడీ అదనపు డీజీ, ఎస్‌హెచ్‌వోకు నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం
- ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులు స్పందిస్తాయన్న న్యాయస్థానం
ఎంపీ రఘురామకృష్ణ రాజు వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రఘురామ వ్యవహారంలో మేజిస్ట్రేట్ కోర్టు ఇప్పటికే ఇచ్చిన పలు ఆదేశాలను రద్దు చేయాలని ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై ఈ రోజు విచారణ జరిగింది.
అయితే, మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వైద్య నివేదిక ఇవ్వాలని ఆదేశించినప్పటికీ సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించింది. రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది.
ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులు ఇవ్వాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ అదనపు డీజీ, ఎస్‌హెచ్‌వోకు కూడా నోటీసులు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టులు స్పందిస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది.