Remdesivir: కరోనా రోగులపై రెమ్‌డెసివిర్ ప్రభావం నిల్.. కొవిడ్ చికిత్స నుంచి దూరం కానున్న ఔషధం!
- కరోనా రోగుల అత్యవసర చికిత్సలో రెమ్‌డెసివిర్ ఉపయోగం
- బ్లాక్ మార్కెట్లో వేలకు అమ్ముడవుతున్న ఇంజక్షన్
- దాని ప్రభావంపై ఆధారాలు లేవన్న డాక్టర్ రాణా
కరోనా రోగులకు అత్యవసర చికిత్సలో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లకు ఇప్పటి వరకు డిమాండ్ ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు. వేలకువేలు వెచ్చించి మరీ బ్లాక్మార్కెట్లో కొనుగోలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ప్రభుత్వం నుంచి సరఫరా అయిన ఈ ఇంజక్షన్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోయిన ఉదంతాలు ఎన్నో. ఇక, తమిళనాడు ప్రభుత్వమైతే చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో రోజుకు ఇన్ని చొప్పున అందిస్తోంది. ఇసుకపోస్తే రాలనంతమంది క్యూలో నిల్చుంటూ దానిని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.
ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే.. తాజాగా ఈ ఇంజక్షన్ ప్రభావంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ ఔషధాన్ని కొవిడ్ చికిత్స నుంచి తప్పించాలని యోచిస్తోంది. తాజాగా సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డీఎస్ రాణా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా బాధితులపై ఇది ప్రభావం చూపిస్తున్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. భారత వైద్య పరిశోధనా మండలి ఐసీఎంఆర్ ఇప్పటికే ప్లాస్మా చికిత్సను ప్రొటోకాల్స్ నుంచి తొలగించింది.
కొవిడ్ నుంచి కోలుకున్న వారి నుంచి సేకరించిన యాంటీబాడీలు కూడా రోగులపై ప్రభావం చూపిస్తాయని తొలుత భావించారు. అయితే, ప్లాస్మా థెరపీ కూడా ఎలాంటి ప్రభావం చూపకపోవడంతో దానిని తొలగించినట్టు రాణా పేర్కొన్నారు. ఇప్పుడు రెమ్‌డెసివిర్ ప్రభావానికి సంబంధించి కూడా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని, కాబట్టి దీని వాడకాన్ని నిలిపివేయడం ఉత్తమమని ఆయన పేర్కొన్నారు.